KRMB Meeting in Hyderabad : జల విద్యుత్ కేంద్రాల ఔట్ లెట్లను స్వాధీనం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, జెన్‌కో నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. గురువారం నాటి సమావేశం సారాంశం వివరాలను కేఆర్ఎంబీ విడుదల చేసింది. జనవరి 17 సమావేశం మినిట్స్‌కు సవరణలు చేయాలని, తెలంగాణ షరతులను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాసిన లేఖను సమావేశంలో కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ అందించారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల ధారాదత్తం అంతా తప్పుడు ప్రచారం : నీటిపారుదల శాఖ
Krishna River Management Board Meeting : తెలంగాణ పరిధిలోని ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తమ పరిధిలోని ఔట్ లెట్లను కూడా బోర్డుకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ఈఎన్సీ తెలిపారు. అన్ని ఔట్ లెట్లను బోర్డుకు అప్పగిస్తే, రెండు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో సిబ్బంది ఉండాలని, వారు బోర్డుకు రిపోర్టు చేయాలని వేతనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వాలని బోర్డు పేర్కొంది. 15 ఔట్ లెట్లకు సరిపడా సిబ్బంది విషయంలో కసరత్తు చేసి వారం రోజుల్లోగా తమకు అందించాలని బోర్డు ఛైర్మన్ రెండు రాష్ట్రాలకు సూచించారు. ఔట్ లెట్లు బోర్డు పరిధిలో ఉన్నప్పటికీ సాధారణ, అత్యవసర నిర్వహణ పనులన్నింటినీ ప్రస్తుతం ఉన్నట్లుగానే ఆయా రాష్ట్రాలు చేయాలని అన్నారు.