Reduced Floods in Joint Krishna District : మహోగ్రంగా ఉరకలేసిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. బుధవారం ఏడు గంటల సమయానికి బ్యారేజీ నీటిమట్టం 11.5 అడుగులకు చేరింది. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో- ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద నీటి నిల్వ పరిస్థితి సాధారణంగా ఉండడంతో ప్రమాద హెచ్చరికను తీసేశారు. కృష్ణానది వరద పెరుగుతుండడంతో మూడు రోజుల నుంచి భయాందోళనలు చెందిన కృష్ణలంక, రామలింగేశ్వర్‌లో ముప్పు తొలగింది. ఇళ్లు ముంపునకు గురైన చోట్ల పారిశుధ్య పనులు ప్రారంభించారు.
బ్యారేజీ దిగువన యనమలకుదురు ప్రాంతంలో ఇళ్లలోకి చేరిన నీరు బయటకొచ్చింది. యనమలకుదురు దిగువన పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని తోట్లవల్లూరు, పమిడిముక్కలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. బాధితులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని తిరిగి శిబిరాలకు చేరుకున్నారు. పులిగెడ్డ అక్విడెక్టు వద్ద 17 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
వరదలకు దెబ్బతిన్న రోడ్లు :ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వరద ముంపు అనంతరం నష్టాలు బయటపడుతున్నాయి. నందిగామ నియోజకవర్గంలో 1400ల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 35 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు సుమారు రూ.200 కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు. అలాగే మరో 42 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. కృష్ణానది వరదకు వైరా ఏరు- మున్నేరు, కట్టలేరు పరిధిలో పొలాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వరదకు కొట్టుకుపోయాయి. వాటిని పునరుద్ధరించే పనులు మొదలయ్యాయి.
AP Floods Effect :జగ్గయ్యపేట నుంచి వైరా-ఖమ్మం వైపు రోడ్డు, లింగాల వద్ద మున్నేరు కాజ్‌వే బాగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు మండలం ముంచితాల, అనగళ్లపాడు, గుమ్మడిదుర్రు, జగ్గయ్యపేటలో బూదవాడ, అన్నవరం గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. రాకపోకలు నిలిచిన గ్రామాల్లో తాత్కాలిక రోడ్లు నిర్మిస్తున్నారు. లింగాల వంతెన శిథిలం కావడంతో ఆంధ్ర- తెలంగాణ ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి.