Koti Book Market in Hyderabad :ఒక స్నేహితుడిని ఇంకొక మిత్రుడు అడుగుతాడు అరే నేను పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అనుకుంటున్నాను. నాకు తక్కువ మొత్తంతో ఖర్చు అయిపోయే విధంగా కాంపిటేటివ్ పుస్తకాలు కావాలి ఎక్కడ దొరుకుతాయి? అని అడుగుతాడు. అప్పుడా మిత్రుడు మన హైదరాబాద్‌లోని కోఠి పుస్తక మార్కెట్‌కు వెళ్లు. ఇప్పటి లేటెస్ట్ పుస్తకాలే కాకుండా పాత పుస్తకాలు సైతం ఎన్నో దొరుకుతాయి. అని చెబుతాడు. వెంటనే అక్కడకు వెళ్లి చూస్తే అక్కడో పుస్తక ప్రపంచం కొలువుదీరినట్లు మనకు కనిపిస్తుంది.
ఇక్కడ ఎల్కేజీ టు పీజీ పుస్తకాలు, మెడిసిన్, ఇంజినీరింగ్, సివిల్స్, రైల్వే, ఎస్ఎస్సీ, డీఎస్సీ వంటి అనేక పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక పుస్తకాలు ఉంటాయి. ఎందుకు ప్రత్యేకంగా కోఠి గురించే చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇప్పటికీ కోఠి పుస్తక మార్కెట్‌ను ఏర్పాటు చేసి 60 ఏళ్లు అవుతుంది. 1964లో ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ నేటికి ఎలా పరివర్తనం చెందిందో తెలుసుకుందాం?
ఈ కోఠి పుస్తక మార్కెట్లో దొరకని పుస్తకం అంటూ ఉండదు. అలాగని ఏదో భారీగా డబ్బులను తీసుకుంటారంటే అదీ కాదు. భారీ డిస్కౌంట్‌తో పాటు పాత పుస్తకాలు మార్కెట్లో ప్రత్యేకంగా దొరుకుతాయి. మనకు ఎల్కేజీ టు పీజీ, మెడిసిన్, ఇంజినీరింగ్, సివిల్ పుస్తకాలే కాకుండా ఆధ్యాత్మిక పుస్తక నేస్తాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు సర్కార్ వారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
కోఠి పుస్తక బజార్లో 20 ఏళ్ల నాటి సిలబస్ పుస్తకాలు కూడా లభిస్తాయి. అకాడమీ పుస్తకాలు, మనం ఏ పబ్లిషర్స్ పుస్తకాలు కావాలో ఇక్కడ దొరకడం మరో ప్రత్యేకత. ముఖ్యంగా కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయిన తర్వాత ఉద్యోగంలో చేరుతారు. ఆ తర్వాత మళ్లీ తీరిగ్గా పరీక్ష రాయాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం నాటి సిలబస్ కావాలి. ఆ సిలబస్ దొరకాలంటే కచ్చితంగా కోఠి సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ కేజీల లెక్కన నోట్ పుస్తకాలు అమ్ముతారు. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి.
చూడడానికి చిన్న దుకాణాలు వేల పుస్తకాలు : కోఠి మార్కెట్లో చూడడానికి అన్ని చిన్న దుకాణాలే కనిపిస్తాయి. వాటిలో వేల పుస్తకాలు ఎలా దొరుకుతాయని చాలా మంది అనుకుంటారు. ఆ చిన్న దుకాణాల యజమానులు సమీపంలో గోదాములు ఏర్పాటు చేసి అందులో పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరుస్తారు. జాబ్ క్యాలెండర్, కోర్సులు ప్రారంభమైనప్పుడు పుస్తకాలు తీసుకువచ్చి షాపుల్లో అమ్ముతారు.
మూడు తరాలకు ఎంతో ప్రత్యేకం : ఈ కోఠి మార్కెట్‌కు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంతే మూడు తరాల వారు ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేస్తారు. తాత, నాన్న, కుమారుడు ఇలా మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ఈ మార్కెట్‌ను సందర్శించి వారికి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా డిగ్రీ, పీజీ విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేస్తుంటారు.