Hanuman Jayanti in Kondagattu Temple : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు చిన్నహనుమాన్ జయంతిని పురస్కరించుకొని రద్దీగా మారింది. దీక్షాపరుల రాకతో కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రతా చర్యలు పెంచారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న చెంతకు దీక్షా పరులు భారీగా చేరుకుని అంజన్నను దర్శించుకుంటున్నారు.
సోమవారం రోజున జయంతి ఉత్సవాలు ప్రారంభం కాగా బుధవారంతో ముగియనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం చలవ పందిళ్లు, తాగునీటి సౌకార్యం, పారిశుద్ధ్య నిర్వహణతోపాటు 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లో వచ్చే వారి కోసం జేఎన్టీయూ వద్ద, బొజ్జ పొతన, గుట్టకింద మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్సవాలను పరిశీలించారు.
మంగళవారం హనుమాన్ జయంతి- అంజన్నకు ఇవి సమర్పిస్తే అన్నింటా విజయమే! - Hanuman Jayanti 2024
"హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయంలో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు అన్ని చేశాం. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షట్టర్స్, తాగు నీటి సదుపాయం అలాగే ఎప్పుడు వైద్యులను అందుబాటులో ఉండే విధంగా చేశాం. భక్తుల కోసం మూడు ఆర్టీసీ బస్సులను ఉచితంగా పెట్టాం. మాల విరమణ కోసం ఏర్పాట్లు, మహిళలు కూడా అధిక సంఖ్యలో వస్తారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేశాం. కానీ భక్తులకు ఒకటే విజ్ఞప్తి ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ కాటన్ దుస్తులు ధరించండి, నీళ్లు ఎక్కువగా తాగండి." - షేక్ యాష్మిన్ బాషా, జగిత్యాల జిల్లా కలెక్టర్