Kishan Reddy oath as Cabinet Minister :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలో నిర్వహించిన బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో, రెండోసారీ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మోదీ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక శాఖమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
Kishan Reddy Political Journey :1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన కిషన్‌రెడ్డి, జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో జనతా పార్టీ యువ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేవైఎమ్లో అఖిల భారత కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
2004లో హిమాయత్‌నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అంబర్‌పేట నుంచి పోటీ చేసి, హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. బీజేపీ శాసనసభాపక్షనేతగాను పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాషాయా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు.
మోదీ కేబినేట్లో రెండోసారి కేంద్రమంత్రిగా స్థానం :2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డి, అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత అనూహ్యంగా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.