Kishan Reddy Rythu Deeksha in Hyderabad :తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ఇంకా అమలు చేయట్లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్‌రెడ్డి (Kishan Reddy Slams Congress)ఆరోపించారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇంకా చేయలేదని విమర్శించారు. హామీలు ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఉదయం చేపట్టిన దీక్ష, సాయంత్రం విరమించారు.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధులు జమకావడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ రైతాంగానికి ఇబ్బందుల పరిష్కారానికి 9904119119 నెంబర్(Toll Free Number) అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి
Kishan Reddy Fires on Congress : కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారంటీల అమలుకు ప్రణాళిక ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్, పంట నష్టపోయిన అన్నదాతలకు రూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. హస్తం పార్టీ ప్రభుత్వ తీరుతో కర్షకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. గజదొంగలు పోయి ఇప్పుడు ఘరానా దొంగలు వచ్చారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం(KCR Family) పోయి సోనియా కుటుంబం రావటం తప్పితే రాష్ట్రంలో వచ్చిన మార్పేమిలేదని అన్నారు. కొత్తగా తీసుకున్న అప్పులను డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇంకా రుణమాఫీ ఎందుకు చేయలేదో ముఖ్యమంత్రి అన్నదాతలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.