Telugu Nyaya Palana Meet in Vijayawada : తెలుగు భాష అమల్లో లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్దామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ కె.మన్నథరావు తెలిపారు. 'అమ్మ భాషను మాట్లాడదాం - ఆత్మాభిమానం చాటుకుందాం' అని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా నిర్వహించిన 'తెలుగులో న్యాయపాలన' సమావేశంలో జస్టిస్ కె. మన్మథరావు మాట్లాడారు.
తెలుగులో తీర్పు రాశాను అనే విషయం తనకెంతో ఆనందంగా ఉందని జస్టిస్ కె.మన్మథరావు అన్నారు. న్యాయమూర్తి అయ్యాక ఎక్కడికి వెళ్లినా మాతృభాషలోనే మాట్లాడినట్లు పేర్కొన్నారు. తెలుగులో తీర్పులు ఇస్తేనే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని తెలిపారు. తెలుగులో తీర్పు ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నా ఆయన, ఆంగ్లంలో ఉన్న తీర్పును తెలుగులోకి మార్చి తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ తీర్పుల వల్ల అప్పీళ్లకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఆయన అన్నారు.
వాళ్లే స్ఫూర్తి : మాతృభాషలో డాక్యుమెంట్ ఉన్నా కొందరు ఆత్మన్యూనతతో ఆంగ్లంలో చదువుతున్నారని జస్టిస్ భీమపాక నగేశ్ అన్నారు. తాము తెలుగులో తీర్పు ఇస్తే ఆంగ్లంలో అభినందనలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. మాతృభాషలో చదువుకునే హైకోర్టు న్యాయమూర్తుల స్థాయికి ఎదిగామని, తెలుగు భాష సహకారంతో వృత్తిపరంగా ఎక్కువ బాగుపడ్డామన్నారు. మాతృభాషలో తీర్పు ఇచ్చేందుకు తనకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలుగును బాగా చదివితే ఆంగ్ల అనువాదం, నేర్చుకోవడం చాలా సులభమవుతుందని తెలిపారు. మన తెలుగు భాష అద్భుతమైందన్న ఆయన దీన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
'భాషను బతికించడంలో మీడియా పాత్ర ఎంతో ఉంది - తెలుగు భాష మన అస్తిత్వం'
ప్రతి ఒక్కరూ తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవించాలని జస్టిస్ బి. కృష్ణ మోహన్ తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు భాషలోని లెస్సదనాన్ని తెలియజెప్పాలని, మన కవులు, వాగ్గేయకారుల గురించి తెలియజేయాలని అన్నారు. మాతృభాషను కేవలం వాడుగ భాషగానే పరిగణించడం సరైంది కాదన్న ఆయన పిల్లలకు తల్లిదండ్రులు మాతృభాష అందిస్తేనే భవిష్యత్తులో తెలుగుని చూడగలమని, వినగలమని, ఎందరో మహానుభావులు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. పాఠశాలల్లో మాతృభాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేయొద్దన్నారు. పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని కోరారు.
తెలుగు వ్యవహారాలు పెంచేలా చర్యలు : హైకోర్టులో మాతృభాష ఎక్కువగా అమలు చేయడంపై చాలా విధాలుగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్‌తో సమానంగా తెలుగులో అర్థం వచ్చేలా కచ్చితమైన పర్యాయపదాల సృష్టిపై కృషి చేస్తున్నామన్నారు. గతంలో కోర్టుల్లో అనువాదాకుల పోస్టులుండగా తీసేశారు, మళ్లీ ఇప్పుడు ఆ పోస్టులను తిరిగి తీసుకురావాల్సిన అవసరముందని తెలిపారు. కృత్రిమ మేధను వినియోగించుకుని కోర్టుల్లో డిజిటలైజేషన్, ఆధునీకీకరణ చేస్తున్నామన్న ఆయన న్యాయస్థానాల్లో తెలుగు వ్యవహారాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తెలుగు భాష అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుందని తెలిపారు. కింది కోర్టు వ్యవహారాలు మాతృభాషలో జరుపుకోవచ్చని ఆదేశాలున్నాయన్న ఆయన మాతృభాష ఉండాలని కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఒక్క ప్రతిపాదన వెళ్లలేదని ఆవేదన వ్యక్తిం చేశారు. హైకోర్టు వ్యవహారాలు తెలుగులోనే ఉండాలనే దానిపై చర్చ జరగాలన్న ఆయన కోర్టుల్లో జరిగేది 99 శాతం మందికి అర్థం కావడం లేదని సీజేఐనే చెప్పారని గుర్తు చేశారు. తెలుగులో వాదనలు వినిపించేందుకు హైకోర్టుల్లో నిషేధం లేదని స్పష్టం చేశారు.
తెలుగులో చదివితే న్యాయపాలన సమర్థంగా : భాష లేకపోతే పదానికి తేజస్సు ఉండదని మహనీయులు చెప్పారని పేర్కొన్నారు. పదకోశం సరిగా లేక తెలుగులో తీర్పులు ఇచ్చేందుకు సమస్యలు వస్తున్నాయన్న ఆయన మాతృభాషలో తీర్పులు ఇస్తేనే కక్షిదారులకు అవగాహన వస్తుందని వివరించారు. తెలంగాణ హైకోర్టులో 1,100 తీర్పులు, ఏపీ హైకోర్టులో 547 తీర్పులను అనువదించినట్లు తెలిపారు. తెలుగులో ‘లా’ చదివితే న్యాయపాలన సమర్థంగా ఉంటుందని కోర్టులో విచారణ జరిగిన తీరు కక్షిదారుడికి తప్పనిసరిగా తెలియాలన్నారు. తెలుగులో న్యాయపాలన అమలుకు సూచనలు ఇవ్వాలని, సలహాలు, సూచనలపై చర్చించి సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం'
international Telugu Sambaralu: 'మాతృభాషను.. ప్రతి ఒక్కరూ ప్రేమించాలి'