Rammohan Naidu Charge as Aviation Minister :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పౌరవిమానయాన బాధ్యత అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కేబినెట్‌లో అత్యంత చిన్న వయస్సులో ఉన్న తనపై బాధ్యత పెట్టారని, రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. యువతపై, ప్రధానికి ఉన్న నమ్మకమేంటో దీంతో అర్థమవుతుందని ఆయన కొనియాడారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి తాను నేర్చుకున్నానని తెలిపారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. విమానాశ్రయాల నిర్మాణానికి నిధులను త్వరితగతిన కేటాయిస్తామని తెలిపారు.
'విమానయాన శాఖ మంత్రిగా నేను చేసే పని అదే!'
భోగాపురం ఎయిర్‌పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం..విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. సామాన్యుడికి సైతం విమనప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయాణికుడికి సౌకర్యం, భద్రత ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఎంపీగా పని చేశానని. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాని తెలిపారు.