Hyderabad Kidney Racket : రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపుతున్న అలకనంద ఆసుపత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ రాకెట్ వెనకున్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరందర్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లాక తుది నిర్ణయం వెలువడనుంది. కిడ్నీ రాకెట్ కేసులో దాతలు తమిళనాడుకు చెందిన వారు. గ్రహీతలు బెంగళూరుకు చెందిన వారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో. మూడు రాష్ట్రాలతో లింకులు ఉండటం, ఒక్కో కిడ్నీ మార్పిడీ పేరుతో రూ.లక్షల్లో వసూలు చేస్తుండటం, వందలాది మందితో లింకులు ఉండటంతో కేసులు సీఐడీకి అప్పగించాలని భావిస్తున్నారు.
కిడ్నీ రాకెట్ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి ద్వారా కొందరి పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడు, కర్ణాటక నుంచి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడీ శస్త్ర చికిత్సలు గతంలోనూ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.