Tribal Student Got a IIT Bombay Seat : చదువుల్లో రాణించాలనే పట్టుదల ఉంటే సదుపాయలు లేకున్న సాధ్యమవుతుందని నిరూపించింది ఈ అమ్మాయి. కుటుంబానికి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదివింది. ఆర్థిక కష్టాలతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి చదువుల్లో రాణించాలనే పట్టుదల పెంచుకుంది. ఆ పట్టుదలతోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకటైన బాంబే ఐఐటీలో సీటు సాధించింది ఈ అమ్మాయి.
ఈ అమ్మాయి పేరు బానోత్ నవ్య. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గంగబండ తండా స్వస్థలం. తండ్రి మోతీలాల్ చిరుఉద్యోగి. తల్లి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వీళ్లది గిరిజన రైతు కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాంతో స్థానికంగా ఉన్న మండల పరిషత్తు ప్రాథమికపాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించింది నవ్య.
పది, ఇంటర్ ఫలితాల్లో మెుదటి శ్రేణి మార్కులతో సత్తా : ప్రాథమిక విద్య తెలుగులో అభ్యసించి, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానికి మారడంతో మెుదట్లో చాలా కష్టపడింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులకు సాయం చేస్తూనే ఆంగ్లంపై పట్టు పెంచుకుంది. దాంతో పదో తరగతిలో 9.5 గ్రేడ్ సాధించింది నవ్య. తర్వాత గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చేసి 964 మార్కులు సాధించింది ఈ విద్యాకుసుమం.
"నా స్కూల్ స్థాయి నుంచి నేను అన్నింటిలో ఫస్ట్ వచ్చాను. దానిఫలితంగా నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు కెనరా బ్యాంకు వాళ్లు నా చదువుకు సంబంధించి స్పాన్సర్షిప్ చేసి, నాకు సపోర్ట్ చేశారు. ఇంటర్లో చేరగానే అక్కడ అంతా ఐఐటీ సిలబస్ ఉండేది, దానికి సంబంధించి కూడా మా టీచర్లు కొన్ని బుక్స్ ఇచ్చారు."-బానోతు నవ్య, విద్యార్థిని
కోచింగ్ తీసుకోకుండానే జేఈఈ ఫలితాల్లో ర్యాంకు :గురుకులంలో ఇంటర్ చదువుతూనే, ఇంకోవైపు జేఈఈ ప్రవేశపరీక్షల కోసం కృషి చేసింది నవ్య. రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ రోజుకు 16 గంటలు చదివింది. అధ్యాపకులు నేర్పిన మెలకువలు తన సాధనకు సాయపడ్డాయి. తోటి స్నేహితుల నుంచి పోటీ తనలో మరింత పట్టుదల పెంచాయి. అవే జేఈఈ ప్రవేశపరీక్షలో రాణించడానికి దోహదపడ్డాయని చెబుతోంది.