Khairtabad Ganesh Height in 2024 : భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి ప్రత్యేకతే వేరు. దేశంలో గణేశ్ చతుర్థిని ఘనంగా జరుపుకునే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంటే ఆ తర్వాత స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్ ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గతేడాది ఇక్కడి గణపయ్య తన ఎత్తుతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు.
అందుకే వినాయక చవితి అనగానే తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణపయ్య. ఇక్కడ రాష్ట్రంలోన అత్యంత ఎత్తయిన, ఎంతో విశిష్టమైన గణపయ్య ప్రతి ఏటా కొలువుదీరతాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండుగ రానుంది. గణేశ్ నవరాత్రుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటాం.
Khairtabad Ganesh Karra Puja 2024 :ముఖ్యంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడి లంబోదరుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొలువయ్యే ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీ పనులను ఇవాళ ప్రారంభించారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఖైరతాబాద్ గణేశ్ మండలి నిర్వాహకులు వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఖైరతాబాద్‌లో మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్టించారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది ఇక్కడి వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.
కర్రపూజ అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించినట్లు చెప్పారు. గణేశ్ ఉత్సవాలకు ఈ ఏడాది కూడా మంచి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని వెల్లడించారు. తొలిపూజ గవర్నర్ నిర్వహిస్తారని చెప్పారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దానం నాగేందర్ వివరించారు.