Kathipudi Ongole National High Way Expantion With 4 And 6 Rows In AP :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించగా, ఆ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లలను ఆహ్వానించారు. దీంతో 390 కిలో మీటర్లు మేర ఉన్న ఈ రహదారిని త్వరలో విస్తరించనున్నారు.
భీమవరం బైపాస్‌కు కొత్త ఎలైన్‌మెంట్ :దాదాపు మూడు సంవత్రరాలుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయిన ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి విస్తరణ, అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. భీమవరం వద్ద కొత్త ఎలైన్‌మెంట్‌తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పామర్రు-ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి-165 విస్తరణ మంజూరు అయింది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 KM 2 వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం నెలకొంది.
భీమవరానికి ఎడమ వైపు వెళ్లేలా 18 KM మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను తొలుత ఖరారు చేయగా, కొందరు స్థానిక ప్రజలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. జాతీయ రహదారి వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.1000 కోట్లు మంజూరు అవుతున్నా, ఎలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటి వరకు పురోగతి లేకుండా పోయింది.
తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మాణం చేసేలా ఎలైన్‌మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఆకివీడు నుంచి ఉండి, వీరవాసరం, భీమవరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 KM మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 KM 4 వరుసలుగాను, మిగిలిన 3 KM 2 వరుసలుగా విస్తరణ చేస్తారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్ సిద్ధం అయితే మోర్త్ ఆమోదం తెలిపి, విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఏర్పడుతుంది.