KARTHIKA POURNAMI DEEPAM 2024 : ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం కార్తికం. పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం నామం ఆ మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంలో జాబిల్లి ఉన్నప్పుడు వచ్చేది కార్తిక మాసం. కృత్తికా నక్షత్రం చాలా ప్రాముఖ్యమైనంది. యజ్ఞ సంబంధమైంది కూడా. దీని అధిదేవత అగ్ని. ఒక్కో మాసంలో ఒక్కో దేవతా ప్రాధాన్యత కనిపిస్తుంది. కానీ కార్తికంలో బహుదేవతారాధన, ప్రత్యేకించి శివ, విష్ణువుల ఆరాధన ప్రధానంగా ఉంటూ అద్వైత భావనకు అద్దం పడుతుంది. కార్తికంతో సమానమైన మరొక మాసం లేదని చెబుతుంది శాస్త్రం.
ఎన్నో పండుగలకు వ్రతాలకు, పూజలకు నిలయం కార్తికం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఉత్థాన ఏకాదశి. ఆషాడశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొనే శుభదినమది. సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు. దేవదానవులు చిలికిన క్షీరసాగర మథనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాబ్ధి ద్వాదశి. ఇక శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది ఈ కార్తిక పౌర్ణమి. గోపికలు మాధవుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమిని రాసపూర్ణిమ అనీ అంటారు. ఆరోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ని దర్శిస్తారని పఠిస్తోంది స్కాందపురాణం.
నెలంతా కార్తిక విధులు కుదరని పక్షంలో :కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసే వ్రతాన్ని భీష్మ పంచకవ్రతం అని అంటారు. నెలంతా కార్తిక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్ఠగా ఈ వ్రతం చేస్తే పూర్తి మాస ఫలితం కలుగుతుందని పండితుల మాట. ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి- కార్తిక స్నానం, దీపారాధన గావించడం, పురాణ పఠనం లేదా శ్రవణం, వృక్షారోపణం, వనభోజనాలు. సూర్యోదయానికి ముందే కార్తిక స్నానాన్ని ఆచరించాలి. అలానే మనిషిలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే దివ్య జ్యోతిని పొందటానికి దీపారాధన ఆపై పూజ, పురాణ పఠనం. వనభోజనమంటే- ఉసిరి చెట్టు నీడలో తయారుచేసి స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయాలి. ఆపై మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరాధన చేస్తారు. అంతేకాక విష్ణు ప్రీతికరమైన రావి, తులసి మొక్కకు - పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ, మోదుగ చెట్లను పూజిస్తారు.