Bangalore Rave Party Latest Update : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం కేసులో సినీ నటి హేమకు ఊరట లభించింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. తనపై నమోదైనటువంటి ఛార్జ్‌షీట్‌ను సవాలు చేస్తూ కొంతకాలం క్రితం హేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. హేమ నిషేధిత పదార్థాలను తీసుకొన్నట్లుగా నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. సుమారు నాలుగు వారాల అనంతరం ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని న్యాయస్థానం పేర్కొంది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విధితమే. అనంతరం బెయిల్‌పైన ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్(మత్తుపదార్థాలు) తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే? :బెంగళూరు శివారు ప్రాంతంలో గతేడాది మే నెలలో జరిగిన ఓ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొని, పోలీసులకు పట్టుబడిన సంగతి విదితమే. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్, బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు హాజరు కాగా, వారిలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ ఉన్నట్లుగా అప్పట్లో పోలీసులు తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను కూడా గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.