Land grab in Karimnagar : కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కలా ఉన్న చెరువులు, కుంటలు కబ్జాల పాలవుతున్నాయి. నగరంలోని తీగలగుట్టపల్లి, ఆరెపల్లిలో ఇప్పటికే కొన్ని కుంటలు కనిపించకుండాపోగా.. బొమ్మకల్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, అలుగునూరులో చెరువులు, కుంటలు క్రమక్రమంగా కుంచించుకుపోతున్నాయి. లోయర్ మానేరు డ్యామ్ ఎఫ్టీఎల్ పరిధిలోనూ జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తుండంతో నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను కూలుస్తున్న హైడ్రా తరహాలోనే కరీంనగర్‌కు ఒక అథారిటీ కావాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని విలీనగ్రామాలతోపాటు సమీపంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటల శిఖాల్లో అక్రమంగా షెడ్లు, భవనాలు నిర్మిస్తున్నారు. పక్కనే ఉన్న పట్టా భూమి కొనుగోలు చేసి.. ఆనంతరం క్రమంగా చెరువులు, కుంటల శిఖాలని కలిపేసుకుంటున్నారు. అలాకోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు పేరిట భూమి కబ్జా చేశాడంటూ బాధితుల ధర్నా
సగానికి తగ్గిపోయిన విస్తీర్ణం : అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ ఫుల్ ట్యాంక్ లెవల్ ఏరియాలో హాళ్లు, గోదాములు వెలుస్తున్నాయి. అలుగునూరులోని మామిడికుంట శిఖంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని మాలకుంట, ఉడతకుంట, అవుసుల కుంట విస్తీర్ణం సగానికి తగ్గిపోయింది. తీగలగుట్టపల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న ఊరకుంటలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. ఈ కబ్జాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా ఎలాంటి చర్యల్లేవనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.