Kalingapatnam lift Irrigation: పంట పొలాల మధ్య పుష్కలమైన నీటి వనరులతో నది పారుతోంది. కానీ, నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా పంట పొలాల్లోకి చేరని దుస్థితి, ఆ నదికి వరదలు వచ్చి పొంగి పంటలు కొట్టుకుపోవడమే తప్ప సాధారణ రోజుల్లో చుక్కనీరు అందని దయనీయ పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో అనేక గ్రామాల్లో వంశధార పక్కనే ఉన్నా రైతులకు కన్నీటి గాథే ఇది.
కళింగపట్నం ఎత్తిపోతల ద్వారా సమస్యకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం పనులు ప్రారంభించింది. కానీ, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో కళింగపట్నం ఎత్తిపోతల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాల్లో ఏడాదిలో 2 పంటలు పండించేందుకు వీలుంది. అయితే గత నాలుగేళ్లుగా ప్రధాన కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో చివరి ప్రాంత భూములకు నీరందడం కష్టమవుతోంది. వానలు సరిగా పడితేనే కాలువల చివరి ఆయకట్టు ప్రాంతాల్లోని పంటలకు నీరు అందుతుంది. లేకపోతే ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సాగునీరు అందక రైతులు నష్టపోవాల్సింది.
కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటూ తెదేపా నేతల నిరసన
గార మండలంలో వమరవల్లి, తోణంగి, కళింగపట్నం, కొర్లాం, కొమరివానిపేట పంచాయతీల్లో వంశధార ఆయకట్టు చివరి భూములు. సుమారు 2 వేల 200 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ఆయకట్టుకు సంవత్సరం పొడవునా నీరు అందాలనే ఉద్యేశంతో, 2018లో గత టీడీపీ ప్రభుత్వం కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. 2.75 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించిన ఈ పనులను అప్పటి ప్రభుత్వం 80 శాతం పనులను పూర్తి చేసింది.
అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎత్తిపోతల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ నాలుగేళ్లు గడుస్తున్నా, ఆ పనుల వంక కన్నెత్తైనా చూడటం లేదు. దీంతో సాగునీరు అందక రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.