Love Brain Disorder Treatment : మనకు ఎంతో నమ్మకంగా ఉంటూ ప్రేమించేవారిని క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేము. కానీ, చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి కారణాల వల్ల కొన్నిసార్లు భాగస్వామికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారితో ఫోన్లో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతూ దగ్గరవుతుంటాం. అయితే, ఒక్కోసారి అవతలి వారు బిజీగా ఉండడం వల్ల మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు.
ఇలాంటప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించకుండా కొంతమంది వాళ్లు ఫోన్ ఎత్తే దాకా పదే పదే కాల్ చేస్తుంటారు. కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏదేదో ఊహించుకుంటారు. ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలా అవతలి వాళ్లపై చూపే అతి ప్రేమ కారణంగా కొన్ని పరిస్థితుల్లో మెదడులోని నాడీ వ్యవస్థ పనితీరులో జరిగే ప్రతికూల మార్పులనే 'లవ్ బ్రెయిన్ డిజార్డర్'గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ ఈ ప్రాబ్లమ్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అలాంటి వారిలో ఎక్కువట!
లవ్‌లో ఉన్నవారు భాగస్వామే తమ లోకమనుకుంటారు! ప్రతీ క్షణం వాళ్ల గురించే ఆలోచిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు స్పందించకపోయినా, మాట్లాడకపోయినా నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఫలితంగా యాంగ్జైటీ, ఒత్తిడి, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి మానసిక సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. ఇప్పటికే వివిధ రకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటోన్న వారిలో 'లవ్ బ్రెయిన్ డిజార్డర్' వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. అందులోనూ చిన్నతనం నుంచి అనారోగ్యపూరిత అనుబంధాల్లో ఉన్న వారిలో, ప్రతికూల వాతావరణంలో పెరిగిన వారిలోనూ ఈ సమస్య అధికంగా వస్తుందంటున్నారు. అంటే చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణకు నోచుకోలేకపోవడం. అలాగే వీటి కోసం ఇతరులపై ఆధారపడడం, వీళ్లు కోరుకున్నప్పుడు అవతలి వారు ఆ లవ్, కేరింగ్‌ను అందించకపోవడం వల్ల ఇలా ఒత్తిడికి గురవుతారట! ఎక్కువమందిలో ఈ తరహా సమస్య ఉన్నప్పటికీ తమలో కలిగే భావోద్వేగాల్ని అదుపు చేసుకుంటూ తమ అనుబంధాన్ని బ్యాలన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తారని నిపుణులు పేర్కొన్నారు.
థెరపీ ముఖ్యం!
- పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో పేరెంట్స్ ప్రేమకు నోచుకోకపోవడం వల్ల వారిలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇదే వారు టీనేజ్‌లో 'లవ్ బ్రెయిన్ డిజార్డర్' బారిన పడేలా చేస్తుంది. అందుకే పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేయకుండా వారిని ప్రేమతో పెంచాలి.
- సహజంగానే ప్రతి ఒక్కరిలో భావోద్వేగాలు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ఇందుకోసం సెల్ఫ్ లవ్, అన్ని విషయాల్లో మనస్ఫూర్తిగా మనల్ని మనం అంగీకరించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇదే పరోక్షంగా భాగస్వామితో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కొనసాగించేందుకూ హెల్ప్ చేస్తుంది.
- కొందరిలో వంశపారంపర్యంగా కూడా ఈ తరహా మానసిక సమస్య తలెత్తచ్చట!
- సమస్య తీవ్రతను బట్టి డాక్టర్లు మందులతో పాటు, వ్యక్తిగత/బృంద థెరపీ కూడా అందిస్తారు. వారి మానసిక స్థితిని బట్టి బిహేవియరల్, టాక్ థెరపీ, డయలక్టికల్ వంటివి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
- ఈ డిజార్డర్ నుంచి బయటపడాలంటే ఫ్యామిలీ సపోర్ట్, కేరింగ్ కూడా ముఖ్యం. కాబట్టి సదరు వ్యక్తి తన మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కావాల్సిన లవ్, ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులదేనని నిపుణులు చెబుతున్నారు!
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పులి కడుపులో మహిళ చెవి దిద్దులు - పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు
ఆఫీసులో పని చేస్తుంటే నిద్ర వస్తుందా! - ఈ టిప్స్ పాటిస్తే రోజంతా హుషారు