CWC Advisor Vedire Sriram On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా గాడి తప్పిందని, ఎవరు చేయాల్సిన పనులు వారు చేయడంలో వైఫల్యం చోటు చేసుకొందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించి, నిర్మాణం అయ్యాక డీపీఆర్ సిద్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన శ్రీరామ్, సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత, మేడిగడ్డకు మార్పు తదితరాల గురించి వివరించినట్లు చెప్పిన ఆయన, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత సమస్య కాదని అన్నారు.
Justice PC Ghose Commission Investigate : ఏ ప్రాజెక్టుకు అయినా ముంపు సహజమే కానీ, గత ప్రభుత్వం దాన్ని కూడా అసహజంగా చూపిందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అడ్డుకుంటుందని చెప్పడం సరైంది కాదని గత ప్రభుత్వానికి చెప్పామన్న శ్రీరామ్, నీటి లభ్యత పుష్కలంగా ఉన్న తుమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే ఇంకా బాగుండేదని కమిషన్ ముందు చెప్పినట్లు పేర్కొన్నారు.
"కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీద ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, మోడలింగ్ అన్నీ కూడా స్టేట్ సీడీఓ చేసింది. సీడబ్ల్యూసీ చేయలేదు, అలానే అనుమతి ఇవ్వలేదు. 195 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇతర రాష్ట్రాలతో ఎటువంటి పంచాయతీ లేదని ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది. ఇవి సీడబ్ల్యూసీ బాధ్యత అందువల్ల అవి మాత్రమే ఇచ్చింది. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది."-వెదిరె శ్రీరామ్, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు