Kaleshwaram Barrage Temporary Repairs : వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం ఆనకట్టలకు (Kaleshwaram Project Issue)తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) అనిల్‌కుమార్ గుత్తేదారు సంస్థలకు సూచనలు చేశారు. డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా శాశ్వత మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడంపై బుధవారం ఈఎన్సీ సమావేశం నిర్వహించింది.
Kaleshwaram Barrages Issue Updates :ఈ సమావేశంలో కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి, సీడీఓ చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్, కాడా చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్, కాళేశ్వరం ఎస్.ఇ. కరుణాకర్, మూడు ఆనకట్టల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్, ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ, మేఘా గుత్తేదారు సంస్థల ప్రతినిధులు సురేశ్, మల్లికార్జునరావు, మనోజ్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
వేసవి సెలవుల తర్వాతే కాళేశ్వరం పిటిషన్ల విచారణ : హైకోర్టు - hc on kaleshwaram project
ఇప్పటివరకు జరిగిన అంశాలను పక్కనపెట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి నీటిని నిల్వ చేయడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. అయితే తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఏయే పనులు చేపట్టాలి, ధరలు ఎంత, ఏ పని ఎంత చేయాలి, పనులకు డిజైన్లు ఎవరిస్తారని గుత్తేదారు సంస్థల ప్రతినిధులు నీటిపారుదల శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు మూడు ఆనకట్టలు, పంపుహౌస్‌లకు కలిపి సుమారు రూ.600 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుత్తేదారు సంస్థలు నీటిపారుదల శాఖకు చెప్పినట్లు తెలిసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో ఏమైనా సమస్య వస్తే చేయడం వేరని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు మూడు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోతే ఏం చేయగలమని వారు చెప్పినట్లు తెలిసింది. దీనిపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.