Kakinada GGH Doctor Surgery to Patient by Showing Movie :కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) మంగళవారం మధ్యాహ్నం, ఓ మహిళా పేషెంట్ చేతిలో ట్యాబ్ ఉంది. తనకు ఇష్టమైన ‘అదుర్స్’ మూవీలోని జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుమ నడిచే హాస్య సన్నివేశాలను ఆమె చూస్తున్నారు. సినిమాలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులో ఏర్పడిన కణితి తొలగింపు శస్త్రచికిత్సను వైద్యబృందం పూర్తిచేసింది. మెలకువలో ఉండగానే (అవేక్ క్రేనియాటమీ) క్లిష్టమైన ఈ సర్జరీని పూర్తి చేయడం ద్వారా వారు ప్రశంసలందుకున్నారు.
కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ.అనంతలక్ష్మి (55)కి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి లాగుతుండటంతో పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించారు. వైద్యం ఖర్చుతో కూడినదని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల డాక్టర్లు తెలిపారు. ఈనెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోతుండగా కాకినాడలోని జీజీహెచ్‌లో చేర్పించారు.
‘అదుర్స్’ మూవీ ఆనందంలో ఉండగా : వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే సర్జరీ ద్వారా దానిని తొలగించారు. ‘అదుర్స్’ మూవీ చూపిస్తూ ఆమె ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఆమె లేచి కుర్చున్నారని, టిఫిన్ తీసుకున్నారన్నారు. జీజీహెచ్‌లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని, మరో అయిదు రోజుల్లో ఆమెను డిశ్ఛార్జి చేస్తామని వైద్యబృందం తెలిపింది. దాదాపు రెండున్నర గంటలపాటు న్యూరోసర్జరీ శస్త్రచికిత్స సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ ట్రీట్మెంట్ సాగిందని వివరించారు.