Students Protest in Kakatiya University : కాకతీయ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో అసౌకర్యాలు విద్యార్ధులను వెక్కిరిస్తున్నాయి. కూలే పైకప్పులు, విరిగిన తలుపులు, చాలీచాలని బాత్రూంలు, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో దినదిన గండంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వర్సిటీలోని రాణి రుద్రమదేవి వసతి గృహం శిధిలావస్ధకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. ఫలితంగా విద్యార్ధులకు వెతలు తప్పడం లేదు. గత రాత్రి ఇదే వసతి గృహంలోని గదిలో సీలింగ్‌పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి.
అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. దీంతో వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్ధులు నినాదాలు చేశారు. పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్‌లో విద్యార్ధినిపై ఫ్యాన్ పడి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో చికిత్స అందడంతో ముప్పు తప్పింది. హాస్టల్‌లో కనీస సదుపాయాలు లేవని, రాత్రైతే భయం భయంగా గడపాల్సి వస్తుందని విద్యార్థులు వాపోయారు. అసౌకర్యాలపై నిర్వాహకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'మేం మెస్‌కు వెళ్లి తిని వచ్చాం. కొందరు బయట ఉన్నారు. నేను హాస్టల్‌లో ఉన్నా. ఆ సమయంలో చిన్న స్లాబ్ పెచ్చు మీద పడింది. వెంటనే అక్కడి నుంచే లేవగానే మొత్తం స్లాబ్ పెచ్చులూడి పడింది. అదే కాకుండా ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. ఈ ఘటన మళ్లీ జరిగినా రిజిస్ట్రార్ మారరు'- విద్యార్థులు