తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య - పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Kadiyam Srihari Joined Congress Today : తెలుగుదేశం, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇలా ఎన్నో పదవులు నిర్వహించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇప్పుడు కాంగ్రెస్‌ గూటికి చేరారు. హైదరాబాద్‌లో నేడు సీఎం రేవంత్‌ సమక్షంలో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలకు పార్టీ కండువా కప్పారు. ఇక వరంగల్‌ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పోటీలో నిలవనున్నారు.

Kadiyam Srihari Joined Congress Today
Kadiyam Srihari Joined Congress Today

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 11:03 AM IST

Updated : Mar 31, 2024, 5:47 PM IST

కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

Kadiyam Srihari Joined Congress Today : పార్లమెంటు ఎన్నికల ముంగిట నేతల పార్టీ మార్పులు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ విధానం బాగా పని చేయడంతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడేది లేదు, కాంగ్రెస్‌లో చేరేది లేదని ఖరాఖండీగా చెప్పిన నేతలే, మరుసటి రోజుకల్లా బీఆర్‌ఎస్‌ను విడిచి, కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్నారు. ఇలా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య(Kadiyam Kavya)లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. హైదరాబాద్‌లో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ, ఇతర నేతలు కడియం నివాసానికి వెళ్లి వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించారు. నేడు సీఎం రేవంత్‌ రెడ్డి వీరిద్దరికీ పార్టీ కండువా కప్పారు.

కడియం శ్రీహరి రాజకీయ ప్రవేశం : వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పని చేసి, విద్యార్థులకు పాఠాలు బోధించిన కడియం శ్రీహరి, దివంగత సీఎం నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1987 ఫిబ్రవరిలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, టీడీపీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 1994 సంవత్సరంలో తొలిసారిగా స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ఎన్టీఆర్ ప్రభుత్వంలో మార్కెట్ గిడ్డంగుల శాఖ మంత్రిగా పని చేశారు. 1999 సంవత్సరంలో మళ్లీ ఎన్నికై, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, భారీ నీటి పారుదల శాఖ మంత్రివర్యులుగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో 2013లో తెలుగుదేశాన్ని వీడి, గులాబీ పార్టీ గూటికి చేరారు. 2014 సంవత్సరంలో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2015లో అనూహ్యంగా తాటికొండ రాజయ్య స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీగా 2021 జూన్ వరకు, తిరిగి 2021 నవంబర్ 16న రెండోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టి ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్​పూర్ టిక్కెట్ ఇచ్చారు.

తాటికొండ రాజయ్యతో వైరం : నియోజకవర్గంలో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలు ఆది నుంచి ఉప్పూ నిప్పూగానే మెలిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రోజూ వార్తల్లో నిలిచారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి రాజీ చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ గాలిని ఎదుర్కొని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై విజయం సాధించి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, కేవలం రెండు స్థానాలకే బీఆర్‌ఎస్‌ పరిమితమైంది. అందులో ఒకటి స్టేషన్ ఘన్​పూర్ కావడం విశేషం.

'ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దనుకున్నాం - అందుకే తగిన నిర్ణయం తీసుకున్నాం'

మూడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడినని చెప్పే శ్రీహరి, ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడే నేతగా గుర్తింపు పొందారు. మారిన రాజకీయ పరిస్ధితుల్లో బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ నీడన చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవలి కాలంలోనూ ఆయన పార్టీ మారుతారంటూ పలుమార్లు ప్రచారం జరిగినా అవి ఊహాగానాలు అంటూ ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత అసెంబ్లీలో కడియం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర్థవంతంగా తన గళం వినిపించారు. బీఆర్‌ఎస్‌ నేతలతో మేడిగడ్డ వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Kadiyam Kavya Joined Congress Party :అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ సర్కార్ ఆరు నెలల్లో కూలిపోవడం ఖాయమంటూ వ్యాఖ్యానించి కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి గురయ్యారు. శ్రీహరి మిగిలిన నేతలను ఎదగనీయరని, ఆయన కారణంగానే పలువురు నాయకులు పార్టీని వదలిపోయారంటూ సొంత పార్టీ వారి నుంచీ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక తన వారసురాలిగా తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన కల. అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం కావ్యకు టిక్కెట్ దక్కించుకోగలిగారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అవినీతి ఆరోపణలు, మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన అంశాలు పార్టీకి అప్రతిష్ట తెచ్చాయని కడియం భావన.

Lok Sabha Election 2024 : అంతేకాకుండా మొదటిసారి పోటీలో నిలిచిన తన కుమార్తెకు జిల్లా నాయకులు సహకరించట్లేదన్నదీ కడియం వాదన. ఈ పరిస్థితుల్లో కావ్య పోటీ చేస్తే ఓటమి తప్పదని కడియం శ్రీహరి గ్రహించారు. దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కావ్య కేసీఆర్‌కు లేఖ రాశారు. పార్టీ మారాలన్న నిర్ణయాన్ని తన అనుచరులతో చర్చించారు. కడియం వెంటే మేముంటామంటూ వారంతా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో బెర్తు లభిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఎదురుగాలి - కాంగ్రెస్ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి!

Last Updated : Mar 31, 2024, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details