Justice PC Ghose Visited Medigadda Today :కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఆయన హైదరాబాద్ నుంచి వాహన శ్రేణి ద్వారా మహాదేవపూర్ మండలం అంబట్పల్లి పంచాయతీ పరిధి మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ భవిశ్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే జస్టిస్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేశారు.
అనంతరం కమిషన్‌కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందంతో జస్టిస్ పీసీ ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలి నడకన సాగుతూ అణువణువునా చూశారు. ఏడో బ్లాక్‌లో 20 పియర్ కుంగి, దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ కుంగుబాటుపై పలు అంశాలపై అధికారుల ద్వారా వివరాలను సేకరించారు. అనంతరం మేడిగడ్డ అతిథి గృహానికి చేరుకొని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై, పలు అంశాలపై విచారించారు.
NDSA Report on Medigadda Barrage Project : మేడిగడ్డ బ్యారేజీలో మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికను ఈ నెల 6న పంపింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది.
పూర్తి నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోతే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో మొదట మధ్యంతర నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కోరింది. దీంతో అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సులతో మధ్యంతర నివేదికను ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారం.