Justice PC Ghose Meeting with Kaleshwaram Project Engineers: కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపడుతున్న న్యాయ విచారణ కొనసాగుతోందని జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించామని పేర్కొన్నారు. బ్యారేజీల ఇంజినీర్ల నుంచి వివరాలు తీసుకున్నామని, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుంటున్నామని, పూర్తిగా నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌లోని బీర్కే భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజినీర్లతో ఆయన సమావేశమయ్యారు. విశ్రాంత ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ రావు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.
Judicial Inquiry On Kaleshwaram : మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని విచారణ కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ చెప్పారు. సాంకేతిక అంశాలపై విచారణ తర్వాత ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ కొనసాగుతోందని, మూడు ఆనకట్టలను తాను స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. విచారణ ప్రక్రియలో భాగంగా విశ్రాంత ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ బసవరాజు, ఈఈలు యాదగిరి, ఓంకార్ సింగ్ ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు.