Justice Ghose Suggestions on Medigadda Barrage Damage : మేడిగడ్డ బ్యారేజీకి వర్షాకాలంలో వరదల నుంచి ముప్పురాకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి జ్యూడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఘోష్ సూచించారు. అందుకోసం నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు ఓ లేఖను ప్రభుత్వానికి కమిషన్ పంపినట్లు తెలిసింది. రెండో రోజు నీటి పారుదలశాఖ ఈ ఎన్‌సీలతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. ఎన్‌డీఎస్‌ఏ సమర్పించిన మధ్యంతర నివేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పర్యటనలో కమిషన్ గుర్తించిన అంశాలపై భేటీలో చర్చించారు.
Meeting on Medigadda Barrage Damage : మేడిగడ్డ రక్షణ చర్యలను ప్రాధాన్య అంశంగా తీసుకోవాలన్న జస్టిస్ ఘోష్ బ్యారేజీకి వరదలు వచ్చేలోపు పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకోసం నిపుణుల సూచనలు తీసుకోవాలని చెప్పారు. హైడ్రాలజీ, ఎలక్ట్రికల్, సివిల్, జియోలాజికల్ తదితర రంగాలకు చెందిన నిపుణులను కమిటీలో నియమించాలని జస్టిస్ ఘోష్ సూచించారు. నెలలోగా ఆ కమిటీ నివేదిక అందించాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్‌డీఎస్‌ఏ సూచించినట్లుగా వర్షాకాలం వరకు గేట్లు అన్ని తెరిచి ఉంచడంతో పాటు నదికి దిగువన, ఎగువన రక్షణ చర్యలు అమలు చేయాలని కమిషన్ సూచించినట్లు సమాచారం.