తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలపై ప్రేముంటే చాలు - తిరుగులేని ఆదాయంతో ఈజీగా కెరీర్‌ సెట్‌ - JOB OPPORTUNITIES IN FLORICULTURE

మొక్కలపై ప్రేమ ఉన్నవారికి ఫ్లోరికల్చర్‌ ఆహ్వానం - ఉద్యోగాల కోసం అందుబాటులో కోర్సులు - తిరుగులేనంత ఆదాయం

Career Growth in Floriculure in India
Career Growth in Floriculure in India (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 4:28 PM IST

Career Growth in Floriculure in India :పచ్చని మొక్కలంటే చెప్పలేనంత ప్రేమ, పూల పరిమళాలకు మైమరిచిపోయో స్వభావం ఉండేవారిని ఫ్లోరి కల్చర్ రంగం ఆహ్వానిస్తోంది. ఉద్యానవనాలను చూసినప్పుడు వదిలివెళ్లలేక పోతుంటే మాత్రం ఫ్లోరికల్చరే మీకు నిజమైన గమ్యస్థానం. మనసు కోరుకునే రంగం ఆదాయ కల్పనలోనూ తిరుగులేనిదైనప్పుడు ఇక ఆలోచించాల్సిందేముంటుంది.

మొక్కలపై విజ్ఞానం :మొక్కల అధ్యయన శాస్త్రం, బోటనీలో పట్టు సాధించాలి. లేకుంటే మొక్కల ప్రపంచంపై అవగాహన పెంచుకోవాలి. వివిధ రకాల మొక్కల పెంపకం, మొక్కల పోషణ, ఏ పంటకు ఏవిధమైన వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి? సీజన్‌ వారీగా వచ్చే తెగుళ్ల నివారణ లాంటి విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి.

నయనానందకరంగా ఉండే పుష్ప సంపదను చూసి ఉప్పొంగాలి. వాటిని ఒక సభామందిరంలోనో, వివాహ వేదికపైనో, వి.ఐ.పి. సన్మానసభలోనో ఎలా అమర్చి చూపరులను ఆకట్టుకోవాలో ఊహల్లో మెదలాలి.

సాంకేతిక నైపుణ్యాలు : గ్రీన్‌ హౌజ్‌ నిర్వహణ సామర్థ్యం, పూలమొక్కలకు వచ్చే తెగుళ్ల బెడద నుంచి కాపాడే అవగాహన- ఈ రంగంలో రాణించాలనుకునేవారికి ఉండాల్సిన కనీస సామర్థ్యాలు.

వ్యాపార దృక్పథం : ఫ్లోరికల్చర్‌ రంగంలో ఆంత్రప్రెన్యూర్స్‌గా అవకాశాలు అన్వేషించాలనుకునేవారు మాత్రం తమ పర్యవేక్షణలో పండిన పూల పంట నుంచి కాసులు కురిపించగల నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. మార్కెటింగ్, సేల్స్, ధర, మార్కెట్‌లో అవకాశాలపై లోతైన అవగాహన ఉండాలి.

పూలను అమ్మే వ్యాపారంలో అది ఏ స్థాయి అయినా భావ వ్యక్తీకరణ పరిమళాలు వ్యాపించాలి. ఫ్లోరి కల్చర్‌ వ్యాపారంలో రైతులు, సరఫరాదారులు, వినియోగదారులతో సంప్రదింపులు జరపాలి. అందువల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా అవకాశాలు :దేశంలో పూలు ఎక్కువగా పండే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే వివిధ ఫ్లోరి కల్చర్‌ సంస్థలు పుష్కలమైన పంటలతో దేశీయ అమ్మకాలూ, ఎగుమతులూ సాధిస్తున్నాయి. కరుటూరి గ్లోబల్‌ లిమిటెడ్, ఫోరెన్స్‌ ఫ్లోరా, సోయెక్స్‌ ఫ్లోరా, ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌ గ్రూప్, (ముంబయి) వంటి వివిధ సంస్థలు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఫ్లోరి కల్చర్‌ కంపెనీల్లో ప్రవేశించాలనుకునే విభాగాలను బట్టి విద్యార్హతలు, నైపుణ్యాలు ఆధారపడి ఉంటాయి.

పెంపకం దార్ల ఎంపిక : గ్రీన్‌ హౌసెస్‌ నిర్మించో, సువిశాల వ్యవసాయ క్షేత్రాల్లోనో వైవిధ్యమైన పూల పెంపకాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. మొక్కల ఆరోగ్యం, పెంపకందార్ల ఎంపిక, పంట పెరుగుదల ఈ విభాగం బాధ్యత.

వివాహాలు, వివిధ వేడుకలు, ప్రత్యేక సందర్భ కార్యక్రమాల్లో పుష్పాలంకరణ చేయడం, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పుష్పాల ఎంపిక, అమరిక ఆకృతిని నిర్ణయించడం ఈ విభాగ నిపుణుల బాధ్యత.

పరిశోధన - అభివృద్ధి :ఎంతసేపూ గులాబీలేనా అనే కస్టమర్లు ఉంటారు. అలాంటి వారి కోసం కొత్తరకం పూల పెంపకం కోసం ఫ్లోరి కల్చర్‌ కంపెనీలోని ఆర్‌ అండ్‌ డీ విభాగం కృషి చేస్తుంది. ఈ విభాగం కొత్త పుష్పాలు- వంగడాల గుర్తింపు, అవి పెరిగే నేలల అధ్యయనం, పెంచే విధానాల రూపకల్పన, పంట దిగుబడిలో హెచ్చుతగ్గులు లేకుండా చూసే పద్ధతులను ప్రవేశపెట్టిడం దృష్టిసారిస్తుంది.

ప్రభుత్వాలు, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు, విశాలమైన తమ ప్రాంగణాల్లో గ్రీనరీ మోడల్స్‌ కోసం ఫ్లోరి కల్చర్‌ కంపెనీలను ఆశ్రయిస్తుంటాయి. అందుబాటులో ఉండే భూ విస్తీర్ణం, నేల స్వభావాన్ని బట్టి ఏ పూలమొక్కలు వేయాలో సూచించి, వాటిని కార్యాచరణలోకి తీసుకురావడం సంస్థల ఉద్యానవనాల నిర్వహణ విభాగం బాధ్యత. ఆ ప్లానింగ్ చేయాల్సిన నైపుణ్యం మన దగ్గర ఉండాలి.

రూ.50 వేల కోట్ల మార్కెట్‌ దిశగా దూసుకెళుతున్న ఫ్లోరి కల్చర్‌ రంగంలో ప్రస్తుతం ఔత్సాహిక వ్యాపార ఆకాంక్ష గల యువతకు బిజినెస్‌ అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇందుకు వారి కావాల్సిన క్వాలిఫికేషన్ పువ్వులపై ప్రేమ.

అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి :జన జీవితంలో పూల వినియోగం విపరీతంగా పెరగడంతో ఫ్లోరి కల్చర్‌ బిజినెస్‌ లాభసాటిగా మారింది. దీంతో ఔత్సాహిక యువతీ యువకులు ఈ రంగంలో వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా పూలను కొని అమ్మే వ్యాపారంగా పరిగణించరాదు. ఆ పనిచేసేందుకు ఎంతోమంది పోటీపడుతుంటారు. దానికి మాటకారితనం ఉంటే చాలు. ఎవ్వరినైనా మాటలతో గారడి చేయగలగాలి. కానీ ఫ్లోరికల్చర్‌ వ్యాపారంలో రాణించాలంటే పూలమొక్కల పెంపక విభాగం దగ్గరినుంచి ఎప్పటికప్పుడు మార్కెట్‌ పరిస్థితులను ఆకళింపు చేసుకోగల సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

కోర్సులతో ఉద్యోగావకాశాలు :‘వ్యాపార రిస్కులు ఎందుకు? నిక్షేపంగా ఉద్యోగం చేసుకుందాం’ అనుకునే వారికి కొన్ని ప్రొఫెషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ స్వల్పకాల కోర్సులు చేయడం ద్వారా పెద్దపెద్ద ఫ్లోరి కల్చర్‌ కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా కావాల్సిన ఉమ్మడి లక్షణం కేవలం పువ్వులపై ప్రేమ మాత్రమే

ABOUT THE AUTHOR

...view details