One Day Deputy High Commissioner : సామాన్యులను ఒక్కరోజు ముఖ్యమంత్రి.. ఒక్క డీజీపీ చేయడం లాంటి సీన్స్ సినిమాల్లోనే చూస్తుంటాం. ఎందుకంటే సినిమా లైఫ్‌కు రియల్ లైఫ్‌కు చాలా తేడా ఉంటుంది. అక్కడ చేసినవన్నీ రియల్ లైఫ్‌లో చేయడానికి వీలు కాదు. కానీ ఈ సీన్లు చూస్తే అచ్చం రియాలిటీలో సినిమాను చూపించారు. గతంలో ఐపీఎస్ మహేశ్ భగవత్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడి కోరికను తీర్చారు. జీవితంలో ఎలాగైనా పోలీసు కావాలనే కోరికతో ఉన్న బాలుడి గురించి తెలుసుకొని.. బాలుడి జీవిత ఆశయాన్ని మహేశ్ భగవత్ నెరవేర్చారు. ఒక్కరోజు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అలాంటి సీన్‌నే రిపీట్ అయింది.. అది ఓ బాలిక బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఎందుకో తెలుసా?
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన అరిపిన జయలక్ష్మి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌గా సోమవారం ఒకరోజు బాధ్యతలు నిర్వహించినట్లు నగరంలోని డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒకరోజు డిప్యూటీ హైకమిషనర్‌గా వ్యవహరించేందుకు బ్రిటిష్ హైకమిషన్ 2017 నుంచి ఏటా దీనికి సంబంధించిన పోటీలు నిర్వహిస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో జయలక్ష్మి ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన జయలక్ష్మి ప్రస్తుతం సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఒక రోజు డిప్యూటీ కమిషనర్ హోదాలో ఆమె సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ జొన్నలగడ్డతో పాటు మై ఛాయిస్ ఫౌండేషన్, డబ్ల్యూఈ హబ్ ప్రతినిధులతో వివిధ అంశాలపై మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ జయలక్ష్మి నివాసానికి వెళ్లి సంబంధిత సర్టిఫికేట్‌ను అందచేశారు.