Jagadish Reddy on Drying Crops : బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపుతోందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చేయబోయే నల్గొండ పర్యటన సందర్బంగా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగార్జుసాగర్లో ప్రస్తుతం నీటిమట్టం కన్నా తక్కువ నీరు ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేశామని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth reddy) వసూళ్ల మీద ఉన్న సోయి పరిపాలన మీద లేకుండా పోయిందన్నారు. రైతు సమస్యలపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Jagadish Reddy fires Congress : రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు అక్రమ వసూళ్ల దందాలు మొదలుపెట్టి, మిల్లర్లనూ బెదిరిస్తూ రూ.కోట్లు పోగు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వసూలు చేసిన సొమ్మునంతా దిల్లీకి తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఒక్క మంత్రి కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి వారు ఉంటే భూమి, ఆకాశాన్ని ఒక్కటి చేసైనా రైతులను ఆదుకునేవారన్నారు.