IT Minister Nara Lokesh Meeting Education And IT Authorities: మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించకుండానే తన పనిని వేగవంతం చేశారు. ఓవైపు ప్రజా ప్రతినిధిగా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు తాను నిర్వర్తిస్తున్న విద్య, ఐటీ శాఖలపై సమీక్షలు నిర్వహించి ఆయా విభాగాలకు సంబందించిన శ్వేతా పత్రాలు తన ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శకంగా టీచర్ల బదిలీలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నూతన ఐటీ పాలసీ తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలనీ దిశానిర్దేశం చేశారు.
నూతన ఐటీ పాలసీ తీసుకొస్తా:రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరున్న సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సూచించారు. త్వరలోనే నూతన ఐటీ పాలసీ తీసుకొస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం ఐటీ శాఖ ముఖ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం.రమణారెడ్డి, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ అనిల్‌కుమార్, ఆర్టీజీఎస్ డైరెక్టర్ చెరుకువాడ శ్రీరామ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఐటీ పరిశ్రమల్ని తీసుకురావడానికి ప్రకటించాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఏర్పాటైన వాటికి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలపై ఆరా తీశారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
విద్యశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష: రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా ధ్రువపత్రాలు కళాశాలల్లోనే వదిలేయాల్సి వచ్చిందని పాదయాత్ర సమయంలో వేల మంది విద్యార్థులు వాపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 2018-19 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వివరాలు, ఈఏపీ సెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ ఏ మేరకు ఇవ్వాలి, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏ మేరకు ఉండాలనే అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు.
ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రాష్ట్ర విభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్ అంశాలు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం ఫలితాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గడంపై సమగ్ర నివేదికలు సమర్పించాలన్నారు. విశ్వవిద్యాలయాల ర్యాంకులు పడిపోవడానికి కారణాలు అధ్యయనం చేసి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చేయాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదమైన ఉప కులపతుల నియామకాలు, వర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారంలోగా నివేదికలు ఇస్తే అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని అధికారులకు మంత్రి లోకేశ్ తెలిపారు.