ISRO Launched PSLV C60 Spadex Mission : అంతరిక్ష పరిశోధళనల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. ఇవాళ శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం సక్సెస్ అయింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకెన్లకు మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ60 రాకెట్ 2 ఉపగ్రహాలతో దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.
అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేసే అత్యంత సంక్లిష్టమైన టెక్నాలజీ అభివృద్ధే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆ టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.