Bomb Threat to Tirupati Hotels : ఇటీవల పలు విమానాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతిలో హై అలర్ట్ - హోటళ్లు, విమానానికి బాంబు బెదిరింపులు - BOMB THREAT TO TIRUPATI HOTELS
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు - ఎయిర్‌పోర్టులోని స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి బాంబు బెదిరింపు - అప్రమత్తమై తనిఖీలు చేపట్టిన అధికారులు
Published : Oct 25, 2024, 7:26 AM IST
"తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్‌కు జైలు శిక్ష పడింది. ఈ శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం మాకు నచ్చలేదు. సీఎం కుటుంబంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అలాగే తమిళనాడుకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తాం’ అని మెయిల్‌లో దుండగులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమై వెంటనే తనిఖీలు చేపట్టగా ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bomb Threat to Tirupati Airport : మరోవైపు ఇటీవల విమానాలకు కూడా బెదిరింపు కాల్స్ ఎక్కువైన విషయం తెలిసిందే. గురువారం రోజున తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎస్5-154 విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆదమ్‌లాన్‌జా 333 పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్ పంపినట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమై ఎయిర్‌పోర్టుకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.