BRS Leaders Investigation in Phone Tapping Case :ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ అధికారులను మాత్రమే విచారించిన దర్యాప్తు బృందం తొలి సారి బీఆర్‌ఎస్ నేత, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు పంపారు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపంగా మధ్యాహ్నం 2.30కి హాజరవుతానని ముందుగా తెలిపారు. కానీ అనారోగ్యంగా ఉందని ఈనెల 14 విచారణకు హాజరవుతానని దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి సమాచారం ఇచ్చారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ నలుగురు నిందితులైన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నలుగురి నిందితుల ఫోన్లను ఎఫ్ఎస్ఎల్కి పంపించి విశ్లేషించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నిందితులు తరచూ పలువురు ప్రముఖులతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న ఫోన్లో లింగయ్య కాల్ డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే! :ఈ డేటా ఆధారంగా చిరుమర్తి లింగయ్యను విచారించేందుకు నోటీసులు పంపారు. నిందితుల ఫోన్లో పదుల సంఖ్యలో ప్రముఖుల కాల్ డేటా ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లింగయ్య విచారణ ఆధారంగా మరికొంత మందిని కూడా పోలీసుల విచారించనున్నారు. మొత్తానికి దర్యాప్తు బృందం తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్‌ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి నోటీసులు ఎవరికి వస్తాయా అని చర్చ మొదలైంది. మరోవైపు ఈ నోటీసులపై బీఆర్‌ఎస్ ఇంతవరకు స్పందించలేదు.