International Yoga Day Celebrations in Telangana 2024 :ప్రపంచ దేశాలకు యోగా మార్గదర్శకంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్, నిజాం కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో యోగ మహోత్సవం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత యోగా ఘనతని ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన యోగ సాధకులు పలు ఆసనాలు ప్రదర్శించారు. కిషన్ రెడ్డి సహా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా యోగాసనాలు వేశారు. యోగ శరీరాన్ని మనసును ఏకం చేస్తుందని, ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ నేనని, ప్రతి ఒక్కరూ సాధన చేయాలని కిషన్ రెడ్డి కోరారు.
Telangana Governor on Yoga Day :అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కరీంనగర్‌లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వ్యక్తులు, సమాజ ఆరోగ్యానికి దోహద పడుతుందన్నారు. మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి యోగా అపారమైన సామర్థ్యాన్ని ఇస్తుందన్నారు.
యోగాతో మానసిక ఆరోగ్యం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో 10వ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.
ఆరోగ్యకర తెలంగాణ నిర్మాణంలో 'యోగా'ది ప్రముఖ పాత్ర : మంత్రి దామోదర