International Kite and Sweet Festival At Parade Ground :రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. భాగ్యనగరవాసులు భారీగా తరలివస్తున్నారు. మూడు రోజులు సాగిన ఈ కైట్ కైట్, స్వీట్ ఫెస్టివల్ ముగియనుంది.
ఆకట్టుకుంటున్న కైట్ ఫెస్టివల్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలతోపాటు అర్జెంటీనా, చైనా, ఇటలీ, సౌత్ కొరియా, సింగపూర్, శ్రీలంక సహా 29 దేశాలకు చెందిన కైట్ ఫ్లయర్స్ రకరాకాల పతంగులను ఎగరవేస్తున్నారు. రాత్రిళ్లు సైతం కనిపించే తారాజువ్వల్లాంటి పతంగులు ఆకాశంలో కనువిందు చేశాయి. నగర నలుమూలలనుంచి ప్రజలంతా ఇక్కడకు చేరుకుని వీటిని తిలకిస్తున్నారు.
ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ : సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫుడ్ అండ్ స్వీట్ స్టాల్స్ నోరూరిస్తున్నాయి. 400 మంది మహిళలు మిఠాయిలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకత పొందిన ఆహారాలను ఫుడ్ స్టాల్స్‌లో అందుబాటులో ఉంచారు. భోజన ప్రియులు వాటిని ఆరగిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.