International Urology Conference In Hyderabad : యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ హైదరాబాద్లో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్‌ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది.
'మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మహిళలు, పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది. గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని గుర్తించినట్లు ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు.
“రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి.” అని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టు, డాక్టర్ భవతేజ్ అన్నారు.
"సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది. - భవతేజ్ ఎనగంటి, ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్