Intensity of Cold has Increased in Telangana :రాష్ట్రంలో చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూటే కాదు మిట్ట మధ్యాహ్నమూ ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు : శనివారం రాత్రి సిర్పూర్ (యు)లో 9.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కెరమిరి, వాంకిడి, ధనోరా, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది.ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్, భీంపూర్, బోథ్, బేల, ఆదిలాబాద్ గ్రామీణం, నేరడిగొండ, మావల మండలాలు చలితో వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణవైపు గాలులు :గుమ్మడిదల, కంగ్టి, న్యాల్‌కల్, అందోలు, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. చలి ఎక్కువగా పెడుతుండటంతో పాడి రైతులు తమ పశువులను రాత్రి వేళలో నెగళ్ల వద్ద కట్టేస్తున్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. రామగుండం, మహబూబ్‌నగర్‌లో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, వరంగల్లో 2.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణవైపు గాలులు వీస్తుండటమే రెండు రోజులుగా రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడటానికి కారణమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ : రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేసింది. 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వీటికి ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.