తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫంక్షన్​ ఏదైనా మనోడు స్టెప్పేసేవాడు - రీల్​ నచ్చిందని చూస్తే తమ్ముడు దొరికేశాడు - INSTAGRAM BROUGHT SON HIS PARENTS

రెండేళ్ల క్రితం అదృశ్యమైన కుమారుడు - కుటుంబసభ్యుల చెంతకు చేర్చిన ఇన్​స్టాగ్రామ్​ - వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఘటన

Instagram Saved Son in Wanaparthy
Instagram Saved Son in Wanaparthy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 8:00 AM IST

Updated : Oct 18, 2024, 1:29 PM IST

Instagram Saved Son in Wanaparthy : ప్రస్తుత కాలంలో సోషల్​ మీడియా ఓ ప్రభంజనమేనని చెప్పాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి విషయాన్ని అరచేతిలోనే చూపిస్తూ ఎందరికో విజ్ఞానాన్ని అందిస్తోంది. మరెందరికో డబ్బులను సంపాదించి పెడుతోంది. అందుకే యువత సోషల్​ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే ఈ సామాజిక మాధ్యమాల వల్ల కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇదే సోషల్​ మీడియా తప్పిపోయిన బిడ్డను కన్నవారి చెంతకు చేర్చి ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. రెండేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని ఇన్​స్టాగ్రామ్​లో వీడియో చూసి కన్నవారు, తోబుట్టువులు గుర్తుపట్టారు. తర్వాత పోలీసులు వారికి తమ కుమారుడిని అప్పగించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శంషాబాద్​కు చెందిన రాములు అనే వ్యక్తికి కుమారుడు చరణ్, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడికి చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దే ఉండేవాడు. రెండేళ్ల క్రితం రాములు ఇళ్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంటికి సామగ్రి తరలించే క్రమంలో చరణ్ కనిపించకుండాపోయాడు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి (రెండేళ్లుగా) తండ్రి తన కుమారుడి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాడు.

చరణ్​ పేరుతో ఇన్​స్టాగ్రామ్​ ఐడీ : ఈ క్రమంలో చరణ్ రెండేళ్లుగా ఎక్కడెక్కడో తిరుగుతూ, వారం రోజుల క్రితం వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరాడు. ఇక్కడే ఉన్న స్థానిక యువకులు విష్ణువర్ధన్​, రఘు, శ్రీకాంత్​తో చరణ్​కు పరిచయం ఏర్పడింది. పట్టణంలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా చరణ్​ అక్కడకు వెళ్లి నృత్యాలు చేస్తుండేవాడు. ఇది గమనించిన ఆ యువకులు చరణ్​ పేరుతో ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచారు. చరణ్​ చేసిన అన్ని నృత్యాలను వీడియో తీసి, వారు ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేసేవారు. ఇలా చరణ్ డాన్స్​​ వీడియోలు చాలా మంది చూసేవారు.

ఈ క్రమంలో ఒకసారి చరణ్​ కుటుంబసభ్యులు సైతం ఆ వీడియోలు చూశారు. దీంతో ఒక్కసారిగా షాక్​కు గురైన తండ్రి, ఇద్దరు అక్కలు ఆ తర్వాత ఎంతో ఆనందపడ్డారు. తన బిడ్డ దొరికాడని తండ్రి, తమ్ముడు దొరికాడని తోబుట్టువులు ఎంతో సంతోషించారు. తర్వాత ఇన్​స్టాగ్రామ్​ ఐడీ వివరాలు తెలుసుకుని ఆ యువకులకు ఫోన్​ చేసి విషయం చెప్పారు. వెంటనే వీడియో కాల్​ చేసి తండ్రి రాములు, అక్కలు చరణ్​ను గుర్తుపట్టారు. దీంతో యువకులు కొత్తకోట పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం పోలీస్​స్టేషన్​కు చేరుకున్న రాములుకు చరణ్​ను అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడిని కన్నవారి చెంతకు చేర్చిన యువకులను ఎస్సై అభినందించారు. చరణ్​ తండ్రి, అక్కలు, బావలు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.

డీమార్ట్​కెళ్లాడు, చాక్లెట్స్​ తిన్నాడు, అరెస్ట్​ అయ్యాడు - కారణం 'వైరల్'

Last Updated : Oct 18, 2024, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details