Inquiries on Decisions of Previous BRS Govt : రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వరుస విచారణలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల, విద్యుత్ రంగాలకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి వివరాలు రాబడుతోంది.
మరోవైపు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ సాగుతోంది. అధికారులను విచారణ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి ఆయన నుంచి వివరణ కోరింది. ఆ గడువు శనివారంతో పూర్తి కానుంది. కమిషన్ లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చే విషయమై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నోటీసుల జారీపై పలువురు న్యాయవాదులు, నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కమిషన్‌కు ఇవ్వాల్సిన వివరణపై చర్చించారు. విద్యుత్‌కు సంబంధించి ఉన్న పరిస్థితులు, ఎందువల్ల అలాంటి నిర్ణయాలు తీసుకున్నామనే వాటిని కేసీఆర్ వివరణలో పేర్కొనే అవకాశం ఉంది. మంత్రివర్గంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ముందుకెళ్లినట్లు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోనూ కొనసాగుతున్న విచారణ : అటు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సాగుతోంది. కమిషన్ దాదాపుగా నీటిపారుదలశాఖ ఇంజినీర్ల విచారణ ప్రక్రియ పూర్తి చేసింది. వారందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అవి పూర్తిగా పరిశీలించాక వాటి ఆధారంగా తదుపరి అవసరమైన వారికి నోటీసులు ఇస్తామని కమిషన్ అంటోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలకూ నోటీసులు ఇచ్చే అవకాశముంది. ఆ పరిస్థితి వస్తే వాటిని బీఆర్‌ఎస్ పెద్దలు, ముఖ్యనేతలు సైతం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.