Indiramma Housing Scheme in Telangana :తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంత మేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు గత సర్కారు నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి 2016-17లో ఒకసారి రూ.1,100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థికసాయం అందింది.
Telangana Govt with Central on Houses in Town :గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 430 కోట్ల వరకు కేంద్రం నుంచి అందనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అంత అనుకూలంగా లేవన్నది అధికారుల అభిప్రాయం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సహాయాన్ని అందిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతో పాటు షరతులూ కూడా అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం 72 వేల రూపాయలు మాత్రమే అందజేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన మూడున్నర లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు - మార్గదర్శకాలు ఇవే!