Indiramma Housing Scheme in Telangana :ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి రూ.3,000ల కోట్ల రుణం సమీకరిస్తోంది. ఈ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు సర్కార్ వెల్లడించింది. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చింది.
Telangana Govt Loan at HUDCO : హడ్కో ఇచ్చే రూ.3,000ల కోట్ల రుణంతో గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇండ్లను నిర్మించ తలపెట్టినట్లు జీవోలో గృహ నిర్మాణ శాఖ పేర్కొంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఈనెల 11న తెలంగాణ సర్కార్ ప్రారంభించనుంది. అర్హులైన వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఒకవేళ సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయనున్నారు. మొదటి విడతగా అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలను కేటాయించాలని భావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి.
ఆకాశమే మీ లక్ష్యమైతే - అక్కడికి తీసుకెళ్లడానికి మేం రాకెట్‌తో సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి
Indiramma Housing Scheme 2024 :ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమై ఈ పథకం అమలుపై చర్చించారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారి కోసం ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని అధికారులకు ఆయన ఆదేలిచ్చారు.