Few Care Tips for Children and Elders in Winter Season : గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో చలి బాగా పెరిగింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీలకన్నా దిగువకు పడిపోతోంది. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా వ్యాపించి ఉండడంతో నాగర్కర్నూల్ జిల్లాలో మరింత చలి పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. చలి కాలంలో అనేక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. మంచు విపరీతంగా ఉండటం వల్ల మనిషి రక్త నాళాలు, కండరాలు కుచించుకుపోయి పలు రకాల వ్యాధులకు గురవుతుంటారు. ఈ సమయంలో ప్రతి ఏడాది ఆసుపత్రుల్లో వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండుటమే దీనికి నిదర్శనం.
నిత్యం వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గత రెండ్రోజుల నుంచి మరో 300 మేరకు పెరిగింది. శీతాకాలంలో ప్రారంభంలోనే గాలిలో వచ్చే మార్పులకు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు, శ్వాస కోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చలి కాలం జనవరి వరకు ఉంటుంది. ముఖ్యంగా నవంబరులో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. శీతాకాలంలో ఎక్కువగా జలుబు అయి ముక్కు కారుతుంటుంది.
దీంతో చెవి దగ్గర గడ్డలా వాపు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది. కండరాలు బిగుసుకుపోవడంతో మోచేయి, మోకాలు, ఇతర జాయింట్లలో నొప్పులు వస్తుంటాయి. రక్తనాళాలు కుచించుకుపోతే గుండెకు బ్లడ్ సర్క్యూలేషన్లో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇది చాలా ప్రమాదకరం. శ్వాస నాళిక కండరాలు బిగుసుకు పోతాయి. దీంతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఉంటుంది. ఆస్తమా ఉన్న వారు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఇబ్బందిగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.