Minister Ponguleti Sudden Inspections in Dammapeta Revenue Office : 'హలో.. నేను రెవెన్యూ శాఖ మంత్రిని మాట్లాతున్నాను. మీరు కొన్ని రోజుల క్రితం దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా.. దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టారా? మీ దగ్గర నుంచి అదనంగా డబ్బులు అడిగారా' అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులన్నీ పరిశీలించారు. ఇటీవల భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల వివరాలను ఉప తహసీల్దార్ కె.వాణిని అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం ఐదుగురికి ఫోన్ చేశారు.
కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
వారితో మాట్లాడిన ఆయన, మీ కోసమే నేను రెవెన్యూ కార్యాలయానికి వచ్చాను. మీరు చెప్పే మాటలను బట్టి రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దుకుంటాం అని రైతులతో అన్నారు. తనకు రెవెన్యూ కార్యాలయంపై ఫిర్యాదులు అందాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు వచ్చానని తెలిపారు. అలాగే తహసీల్దారు సి.హెచ్ నరేశ్ రెండు వారాలుగా సెలవులో ఉండటంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రెండు వారాలుగా సెలవులు పెట్టాడనికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో అవినీతికి తావులేకుండా చూడాలని, రైతులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, స్థానిక కాంగ్రెస్ నాయకులు వెళ్లారు.
'ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాలు తెలుసుకునే పరిస్థితి లేదు - కానీ భూ భారతిలో వివరాలు అన్నీ ఉంచుతాం'