- తెల్లని గడ్డం
- నీలం రంగు తలపాగా
- తెల్లని చొక్క
- జేబులో పెన్ను
ఇదీ దేశ ప్రధానిగా పదేళ్లపాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు. 2004లో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2014 వరకూ కొనసాగారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు.
ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ!
Manmohan Singh Biography : పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలొచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్‌ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరఫున ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరుగెత్తించాలనే ఉద్దేశంతో పీవీ ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్‌లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు.
స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ!
1992లో జరిగిన స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 1993లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని పీవీ ఆయనను వారించారు. 1991లో అసోం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995, 2001, 2007, 2013లో రాజ్యసభ సభ్యుడయ్యారు. భాజపా అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999లో దక్షిణ దిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్‌రాజ్‌కు చరమగీతం పాడారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాకా ఆయన కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8 నుంచి 9శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధిరేటు 9శాతానికి ఎగబాకింది. స్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు. పీవీ అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పీవీ-మన్మోహన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధిహామీ పథకం వంటివి తీసుకొచ్చారు.
దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కాలంలో పదేళ్ల పాటు ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబరు 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై.. 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజూ 18గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు.