Heavy Rains in Hyderabad : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హైచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈసందర్భంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(GHMC) అప్రమత్తయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. అత్యవసరం అయితే 040-21111111, 9001136675 నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ఇప్పటికే నగరంలో మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌లో వర్షం పడుతోంది.
మరోవైపు నైరుతి రుతుపననాలు గురువారమే తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఆయా పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.