Illegal Transportation of Ganja in Trains : గంజాయి రవాణాపై పోలీసుల తనిఖీలు ఎక్కువవ్వడం రోడ్డు మార్గాల్లో పోలీసులకు తరచూ చిక్కుతుండడంతో నేరగాళ్లు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాల తనిఖీల్లో ఎప్పటికప్పుడు సరకు పట్టుబడుతున్నా రవాణా అయ్యే పరిమాణంతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని అధికారులే అంగీకరిస్తున్నారు. చిన్న రైల్వే స్టేషన్లు కేంద్రంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్(Drug Smuggling in Hyderabad) ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిర్దేశిత బస్ స్టాపులు, పట్టణాల్లోనే ఆగుతాయి. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే అంతర్రాష్ట్ర సరిహద్దులు, అక్కడక్కడా పోలీసు తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణించే రైళ్లు చిన్నపాటి గ్రామాలు నగర శివార్లలో ఉండే స్టేషన్లలో ఆగుతుంటాయి. కొన్నిసార్లు రూట్ క్లియరెన్స్ కోసం శివార్లలో ఆపాల్సి ఉంటుంది. నేరగాళ్లు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు.
Ganja Smuggling in Telangana : ఉదాహరణకు ఏవోబీ సరిహద్దులు, ఒడిశా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చే వారు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వరకూ రాకుండా శివారు ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లలో దిగుతారు. ఇక్కడ ఎలాంటి తనిఖీలు ఉండకపోవడం అక్కడి నుంచి వాహనాల్లో నగరానికి చేరుకుని దందా చేస్తున్నారు. భారీ మొత్తంలో కాకుండా ప్రయాణికుల్లా నటిస్తూ కిలోల పరిమాణంలో చిన్న సంచుల్లో గంజాయి(Ganja) తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకేసారి ఐదారుగురు కలిసి చిన్న మొత్తాల్లో వేర్వేరు బోగీల్లో ఉంటూ తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు అనుమానమొస్తే సరకు వదిలేసి తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు. కొన్నిసార్లు వేర్వేరు బోగీల్లోకి మారుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారని పోలీసులు తెలిపారు.
శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - పొలంలోనే సాగు - చివరికి పోలీసులకు చిక్కి