Encroached ponds and canals in Hyderabad : సాగు, తాగు నీటిని అందించడంలో చెరువులు కీలకం. కానీ, ఆ చెరువులే కబ్జాకు గురవుతున్న వైనం. చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన నాటి రాజులు, పాలకులు వాటి సంరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటే నేటి కబ్జాదారులు మాత్రం మాకు అవేవి పట్టవు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భూములకు అధిక ధరలుండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కబ్జాదారులు విశ్వరూపం చూపిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే నగరంలో ఏ చెరువు చూసినా ఆక్రమణల చెరలో చిక్కిశల్యమవుతోంది.
ఆక్రమణలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటిపై చర్యలు అంతంతమాత్రమే. ఆయా శాఖల్లోని అధికారులు, రాజకీయ నేతల అండదండలతో కబ్జాదారులు వందల కోట్ల విలువైన చెరువుల స్థలాలను ఆక్రమిస్తున్నారు. వాటిల్లో కొద్దిరోజుల్లోనే అనధికారికంగా వెంచర్లు వేసి ఇంటి స్థలాల కింద అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కబ్జాలకు గురైన, గురవుతున్న చెరువులు, నాలాలను వివరాలు విస్తుపోయేలా చేస్తాయి.
నగర శివారు పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఏదుల నాగులపల్లి వద్ద గల 12 ఎకరాల నాగులకుంట చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురైంది. చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసి రెండేళ్లు కావస్తోంది. ఇప్పటికీ దీనిపై పోలీసు శాఖ విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే నియోజకవర్గంలోనే ఖాజీపల్లి వద్ద విశాఖ వారి చెరువు 4 ఎకరాలు ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
చెరువులో మట్టి నింపే ప్రయత్నం : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మామిడికుంట చెరువులో ఏడాది కిందట ఓ వ్యాపారి ఎకరా భూమి కబ్జా చేశాడు. అది మరవకముందే అదే వ్యాపారి అదే చెరువులో 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు రాత్రికి రాత్రే 20 ప్రొక్లెయిన్లు, 40 టిప్పర్లతో ఆస్థలాన్ని మట్టితో నింపేందుకు యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో వారిని రౌడిలతో బెదిరించారు. శంషాబాద్ పోలీసులు స్పందించి 2 లారీలు, ఒక టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
కాటేదాన్ బాబుల్ రెడ్డినగర్‌లో నర్సబాయికుంట రెండేళ్ల కిందటి వరకు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. మామిడి కుంటను ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యాపారితో పాటు మరికొందరు రెండేళ్లలో ఈ చెరువు మొత్తాన్ని మట్టితో పూడ్చి అనధికారిక వెంచర్‌ను వేసి ఇళ్ల స్థలాలుగా చేసి విక్రయించారు. ఇదే కాటేదాన్‌లోని అప్పాచెరువు గతంలో 39 ఎకరాల్లో ఉండేది. కానీ, అక్రమార్కులు వలలో పడిన చెరువు 12 ఎకరాలే మిగిలింది. ఇక్కడే అనేక ఇళ్లను కూడా నిర్మించారు.
వెంచర్ల కోసం :చుట్టూ కాంక్రీణ్ అరణ్యాలు పరుచుకోవడంతో వానాకాలంలోనూ చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. అదే అదునుగా నీళ్లు లేని చెరువులను మూసేస్తే భవిష్యత్‌లో వెంచర్లకు ఉపయోగపడుతుందన్న ముందస్తు అంచనాతో కొందరు అక్రమార్కులు దుండిగల్ మండలంలోని లక్కకుంట చెరువును మట్టితో కప్పేస్తున్నారు. అక్కడ ఎకరా విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుందని, ఈ లెక్కన 8.30 ఎకరాల విస్తీర్ణమున్న చెరువు విలువ రూ.83 కోట్లు ఉంటుందని అంచనా.
చెరువు సమీపంలోకి ఎవరూ రాకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. చెరువును పూడ్చేస్తున్నా అధికారులు లక్కకుంట వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న తుమ్మిడి చెరువు ఎకరాకుపైగా కబ్జాకు గురైంది. ఖానామెట్ మొండికుంటలో ఓ వైపు శ్మశానం ఉండగా, అవతలి వైపు ప్రైవేటు వ్యక్తులు చెరువుస్థలాన్ని ఆక్రమించారు. జీహెచ్‌ఎంసీ, నాగారం మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో చర్లపల్లి చెరువు శిఖంలో లోటస్‌కాలనీ వైపు ఎకరాల కొద్దీ కాలనీలు వెలిశాయి.