IIT Fees Increased:దేశంలోని ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) బీటెక్ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఐటీల్లో వసూలు చేస్తున్న ఫీజులు, విద్యార్థులపై చేస్తున్న వ్యయం తదితర అంశాలపై అధ్యయనం చేసి కొత్త ఫీజులపై నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దీని గురించి రెండు నెలల క్రితమే ఐఐటీ బాంబే, ఇండోర్, తిరుపతి డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది.
చివరిసారిగా 2016లో ఐఐటీల ఫీజును రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. మళ్లీ 8 సంవత్సరాల తర్వాత ఫీజుల అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈసారి కనీసం 50 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో 23 ఐఐటీలు ఉండగా, వాటిలో గత ఏడాది 17,600 వరకు బీటెక్ సీట్లు ఉన్నాయి.
కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం : ఐఐటీల్లో వసూలు చేయాల్సిన సహేతుక ఫీజులను సిఫారసు చేయాలని కేంద్రం కమిటీని ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై కమిటీ చర్చలు కొనసాగిస్తోంది. 2013లో రూ.50 వేలు ఉన్న ఫీజును రూ.90 వేలకు పెంచారు. మళ్లీ 2016లో రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ప్రస్తుతం 8 ఏళ్లు పూర్తయినందున ఆదాయ, వ్యయాలను పరిశీలించి కొత్త ఫీజులను నిర్ణయించాలని కేంద్రం భావిస్తోంది. కనీసం 50 శాతం పెంచినా ఫీజు రూ.3 లక్షలు ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కేంద్ర విద్యా శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఐఐటీ కౌన్సిల్ సమావేశం ఉంటుంది. దీంట్లో ఐఐటీల డైరెక్టర్లు, ఏఐసీటీఈ, యూజీసీ ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలోనే ఐఐటీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.