IAS Transfers in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున జిల్లా కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 జిల్లాలకుగాను 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వైఎస్సార్సీపీతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. జగన్ భక్త అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీకి బదిలీ చేసింది. గుంటూరు కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మిని నియమించింది.
విశాఖలో అసైన్డ్ భూముల కుంభకోణంలో కలెక్టర్మల్లికార్జున్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూ దోపిడీకి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై వేటువేసిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్‌గా జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. తూర్పుగోదావరి కలెక్టర్ మాధవీలత అమరావతి రైతులను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు, మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని అభియోగాలు ఉన్నాయి.
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన 21 మంది కీలక అధికారులపై వేటు - IAS TRANSFERS in AP
ఫలితంగా ఆమెను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం తూర్పుగోదావరి కలెక్టర్‌గా పి.ప్రశాంతిని నియమించింది. మాజీ సీఎం జగన్ ప్రైవేట్ సంస్థలకు సహకరించేలా ఉత్తర్వులు ఇచ్చారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగారని చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహనుపై విమర్శలు వచ్చాయి. అయితే అందరినీ విస్మయానికి గురిచేసేలా ఆయన్ను ప్రభుత్వం కాకినాడ కలెక్టర్‌గా నియమించింది. కాకినాడ కలెక్టర్ జె. నివాస్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
చిత్తూరు కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ను నియమించింది. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్ కుమార్‌ను నియమించగా ప్రస్తుత కలెక్టర్ విజయసునీతను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏలూరు కలెక్టర్‌గా కె.వెట్రిసెల్విని నియమించగా ప్రస్తుత కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌ను జీఏడీకి బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా సి.నాగరాణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజనలను నియమించింది. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రకాశం కలెక్టర్‌గా ఏ.తమీమ్ అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా, బాపట్ల జేసీకి కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలువురిని జీఏడీకి అటాచ్ చేసిన ప్రభుత్వం - IAS Transfers in AP