Hydra Operations in Hyderabad : రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా, అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తోంది. ఈ క్రమంలో జూన్ 27 నంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా వెల్లడించింది.
రాజకీయ నేతల ఆక్రమణలు : తద్వారా కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లతో పాటు పార్కు స్థలలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
అలాగే నందగిరి హిల్స్‌కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్క్ స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. బహదూర్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రెహమత్ బేగ్ రాజేంద్రనగర్‌లోని బుమ్ రూఖ్‌దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదస్తుల భవనాలు, ఒకటి రెండస్తుల భవనంతోపాటు మరో భవనాన్ని కూల్చివేశామని హైడ్రా స్పష్టం చేసింది.
పారిశ్రామికవేత్తల నిర్మాణాలు : ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది. ఇక గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రోకబడ్డి యజమాని అనుపమలు ఆక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది.