Hydra Officials Focus on Nalas in Hyderabad : రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే ధ్యేయంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అనధికారిక నిర్మాణాలను నిట్టనిలువునా కూల్చేస్తోంది. ప్రజల నుంచి సానుకూలత, బాధితుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వాటన్నింటిని పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా బృందాలు తెల్లవారుజామునే రంగంలోకి దిగి నిర్దేశించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి.
అయితే మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలతోపాటు దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులోని విల్లాల కూల్చివేత తర్వాత హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తాయి. వాటిపై స్పందించిన రంగనాథ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఆక్రమిత నివాసాలను కూల్చబోమని స్పష్టం చేశారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని కూల్చివేతలపై ఆచితూచి వ్యవహరించాలని భావించిన హైడ్రా, ఇక నుంచి కొన్ని రోజులపాటు నాలాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా తన కార్యాలయంలో హైడ్రా అధికారులతో సుమారు 3 గంటలపాటు చర్చించిన రంగనాథ్ నాలాలపై హైడ్రా ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఆక్రమిత నిర్మాణాలే తొలి ప్రాధాన్యతగా : ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జోన్‌కు 5 చొప్పున కనీసం 50 చెరువులను పూర్తిగా పునర్జీవం కల్పించాలని అటు జీహెచ్ఎంసీ, హైడ్రాకు లక్ష్యంగా నిర్దేశించారు. ఆ పనులు పూర్తి చేయాలంటే ముందుగా నాలాలపై దృష్టి పెట్టాలని హైడ్రా నిర్ణయించుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించిన రంగనాథ్, ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలపై అక్రమంగా నిర్మించిన నివాసేతర నిర్మాణాలను తొలగించాలని వారిని ఆదేశించారు. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డులేకుండా ఉండాలంటే ముందుగా ఆక్రమిత నిర్మాణాలను తొలగించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.
కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు నగరంలోని నాలాల ఆక్రమణలపై సిబ్బంది దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 370 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు ప్రవహిస్తున్నాయి. 1250 కిలోమీటర్ల మేర వరద నీటి కాలువలున్నాయి. వరద, మురుగు నీటిని మోసుకెళ్తూ మూసీలో కలుస్తాయి. కొన్నాళ్లుగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రహదారులన్నీ జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కారణం. గతంలో జీహెచ్ఎంసీ చేపట్టిన సర్వేలో నాలాలపై 12 వేలకుపైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు.
నాలాలపై సర్వే కోసం ఇంజినీరింగ్ విద్యార్థుల సహకారం : అందులో 35 శాతం మేర నివాసేతర నిర్మాణాలే ఉన్నట్లు తేల్చారు. వాటి వల్ల కొన్ని చోట్ల 50 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 10 అడుగుల వెడల్పుకు చేరుకున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోతున్నాయని, పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులకు నివేదించారు. కానీ ఆ అక్రమణల తొలగింపు ఇన్నాళ్లు కంటితుడుపు చర్యగానే ఉండిపోయింది. మరోవైపు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం కింద కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ఈ పరిస్థితుల్లో నగరం ముంపు భారీ నుంచి తప్పించుకోవాలంటే నాలాల వ్యవస్థను చక్కదిద్దేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతుంది. ఇప్పటికే రాంనగర్ మణెమ్మ కాలనీలోని నాలాపై నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. అదే తరహాలో మిగిలిన నాలాలపై ఉన్న ఆక్రమణలను ఒక్కొక్కటిగా కూల్చివేసేందుకు హైడ్రా సన్నాహాలు చేస్తోంది. నాలాల పునరుద్ధరణ కోసం జేఎన్టీయూ, బిట్స్ పిలానీలోని ఇంజినీరింగ్ విద్యార్థులు హైడ్రాకు సహకారాన్ని అందిస్తున్నారు. నాలాలపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిచ్చే నివేదికలు, చెరువుల పునరుద్ధరణపై నిపుణులు ఇచ్చే ప్రణాళికలను ముఖ్యమంత్రికి పంపించి తదనుగుణంగా హైడ్రా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
'హైడ్రా'కు ప్రత్యేక పోలీస్ సిబ్బంది - డీజీపీ కార్యాలయం కీలక ఉత్తర్వులు - Special Police force For Hydra